Gayatri Jun 16, 2019

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం. విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం. ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి. పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృ తి), అయ్యవారిని(భూమి) అర్చించాలి. వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది. ప్రకృతిని కాపాడుకోవడమే. ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం. ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింపజేయగలమా? ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం. కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి. జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ. వ్యవసాయేతరులు కనీసంగా ఈ రోజు ఒక వృక్షాన్ని/మొక్కని పాతాలి. ఇది భవిష్యత్ తరాలకోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతిఒక్కరూ స్వీకరించాలి. ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లైతే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక. ప్రకృతి పార్వతికి ప్రతీక. గరిమనాభి (central point) గణపతికి ప్రతీక. ఈ భూమి యే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ వుంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవన ధార విశేషము, ఫలితాంశము కూడా. వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో వుంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకర్థమౌతుంది. ఏవిధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను వున్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆవిధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తిప్రతిష్ఠలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం వుంచుకునేలా వ్యవహరిమ్చాలి. ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. కానీ అవి ఏవీ కూడా వాటి పండ్లని అవి తినవు కదా! ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా! ఆవిధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరులకోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం. కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరమూ కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం.

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
Gayatri Jun 16, 2019

*వినయం* లోకంలో భాగ్యవంతుడు ఎవరు అంటే వినయశీలి అంటారు పెద్దలు. వినయం ఉంటేనే విద్య అబ్బుతుంది. విజయం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. వినయం అనే ఒక్క సద్గుణం ఉంటే అన్ని సంపదలూ మనిషి దరిచేరతాయి. అది, జీవితంలో మనిషి కష్టపడి సముపార్జించవలసిన దైవీగుణ సంపద. పూర్వం గురుకులాల్లో విద్యతోపాటు వినయాన్నీ నేర్పేవారు. మనసు ఎలాంటి రంగూ సంతరించుకోని బాల్యం నుంచే వినయాన్ని అభ్యసింపజేసేవారు.వినయాన్ని అలవరచిన తరవాతనే,గురువులు విద్యను బోధించేవారు. ఉత్తమ విద్యార్థి లక్షణాల్లో వినయాన్ని ప్రధానంగా చెబుతుంది తైత్తిరీయం. గురు భావననుంచే వినయం అలవడుతుంది. అందుకే గురుసేవను, గురుభక్తిని విద్యార్థిలో పెంపొందించేవారు. గురువు నుంచి విద్యను మాత్రమే సేకరిస్తే అది పూర్ణత్వానికి దోహదపడదు. మనిషి గమ్యాన్ని వినయం, విజయం, అహంకారాలు అనేవి విశేషంగా ప్రభావితం చేస్తాయి. మనిషి ఉన్నతికి, పతనానికి ఇవే హేతువులు. అనుకున్నది సాధిస్తే, మనిషి ఆనందానికి అవధులుండవు. ఆత్మవిశ్వాసాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. ఎదుగుదలకు మార్గం వేస్తుంది. జవసత్వాలు అందిస్తుంది. మనిషి చేసే ప్రతీ పని ఈ విజయం కోసమే. విజయాన్ని అణకువతో స్వీకరిస్తే, అది యోగంగా పరిణమిస్తుంది. అహంకరిస్తే పతనాన్ని శాసిస్తుంది. వినయం ఉన్నవాడు విజయం-అహంకారాల చక్రబంధంలో చిక్కుకోడు. అహంకారం ప్రతీ మనిషిలో సహజంగాను, స్వభావికంగాను ఉంటుంది. తాను గొప్పవాడిని కావాలనుకుంటాడు. ముందు వరసలోనే ఉండాలనుకుంటాడు. ఇది సహజం. అహంకారం ఉంటేనే ప్రతిభను వృద్ధి చేసుకుంటాడు. ఎదుగుదలకు కృషి చేస్తాడు. వినయం ఉంటే అహంకారం పరిపక్వానికి చేరుతుంది. అప్పుడు మనిషి విజయాన్ని దైవప్రసాదంగా స్వీకరిస్తాడు. గెలుపును ఓటమిని దైవాధీనంగా భావిస్తాడు. తాను భగవంతుడి చేతిలో ఒక ఉపకరణం మాత్రమే అనుకుంటాడు. తన ప్రతిభ కూడా దైవం నుంచే వ్యక్తమవుతోందని గ్రహిస్తాడు. జీవితంలో పొందే సకల అనుభవాల ద్వారా దైవం అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. భగవంతుడి విశ్వప్రణాళికలో భాగంగా జన్మించానని భావిస్తాడు. ‘సకల శక్తిని దైవం నుంచే పొందాను, ప్రతి నిమిషం ఆయన సహాయంకోసం ఎదురుచూస్తాను, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష’ అని ఆత్మబోధన చేసుకుంటాడు. వినయం లేని మనిషిలో అపరిపక్వ అహంకారం మెండుగా ఉంటుంది. అంతా తన ప్రతిభేనని గర్విస్తాడు. తన కన్నా ఎక్కువ ప్రతిభ కలిగినవారిని చూసి ఓర్వలేడు. సాధించినదానితో తృప్తిపడడు. గెలుపుకోసం అడ్డదారులు, దొడ్డిదారులు తొక్కుతాడు. ఇతడిలో గెలుపు అహంకారాన్ని, ఓటమి ద్వేషాన్ని రగిలిస్తాయి. ‘నేను ఎదగాలి’ అని కాకుండా, ‘నేనే ఎదగాలి’ అని కోరుకుంటాడు. ధనంతోటే సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు పొందుతాడు. హుండీలో డబ్బులు వేసో, పట్టుబట్టలు, పూజా ద్రవ్యాలు సమర్పించో దైవానుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుంటాడు. చనిపోయిన తరవాత మనిషిని చితిమంటలు కాలిస్తే, బతికుండగానే అహంకారం మనిషిని దహిస్తుంది. అహంకారం మనిషిని అనునిత్యం వెంటాడే శతుృవు. వినయం ద్వారానే దీన్ని జయించగలం. వినయం అంటే అనువుగా ఉండటం. అణకువగా ఉన్న వ్యక్తిని ఎవరూ భంగపరచలేరు. పరిస్థితులు అతడికి లోబడి ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు సైతం అనుకూలంగా మారతాయి. వినయాన్ని మించిన మిత్రుడు, వినయం కన్నా గొప్ప ఆభరణం మనిషికి మరొకటి లేదు. గురుభక్తి, దైవంపట్ల విశ్వాసం వల్లనే ఇది అలవడుతుంది!

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
Gayatri Jun 15, 2019

ఎల్లుండే *జేష్ఠ పౌర్ణమి* మనకు ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది.. భగవంతుడు ని ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా జరుపుకుంటారు.. అయితే ఈ జేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాలు తీరదనికే చేసుకోవాలి..ఈ మాసంలో సోమవారం వచ్చిన అమావాస్య ని సోమవతి అమావాస్యగా జరుపుకున్నారు ఆ రోజు రావి చెట్టు ప్రదర్శనలు చేసే ప్రత్యక్షంగా నారాయణుడికి రావి చెట్టు రూపంలో పూజించారు , అలాగే ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజు... చాలా అరుదుగా జేష్ఠ పౌర్ణమి సోమవారం రోజు కలిసి వచ్చింది.. ఇది ఎన్నో సమస్యలకు పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది... అవి ఏంటో తెలుసుకుందాము.. 1. సహజంగా జేష్ఠ నక్షత్రం బలి నక్షత్రం వీళ్ళు నిత్యం శివుడికి సోమవారం ఆవు నైయి తో దీపము పెట్టడం వల్ల ఎన్నో ఆటంకాలనుండి ఉపశమనం లభిస్తుంది, అయితే ఈ సోమవారం పౌర్ణమి రోజున ఇంట్లో మొదటి సంతానం కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఏ వయసు వారు అయినా కావచ్చు ఇంట్లో ,(గుడిలో అయితే ఇంకా మంచిది ) ఆవు నైయి తో దీపారాధన చేసి శివుని అష్టోత్తరం చేయాలి... ఇలా చేస్తే వారి తో పాటు వారి కుటుంబం అంతా మంచి జరుగుతుంది.. ఒక్కరే సంతానం ఉన్న ఇంట్లో పిల్లవాడు తండ్రి ఈ దీపారాధన సంతానం పెరు తో చేసుకోవాలి... 2. తరచుగా గొడవ పడుతున్న భార్య భర్తల, విడిపోయే పరిస్థితిలో ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు తల స్నానం చేసి ఇంట్లో శివుడికి , చింబిలి (బియ్యం,నువ్వులు, బెల్లం, నైయి mixcy లో వేసి పొడి చేసి ముద్దగా చేసి ఆ ముద్దలో దీపంలాగా చేసి అందులో నైయి పోసి దీపం పెట్టాలి రెండు చింబిలి ఉండలు దీపం పెట్టాలి) కొద్దిగా చింబిలి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి అని కోరుకొని అర్ధనారీశ్వర స్త్రోత్రం 11 సార్లు పారాయణం చేసి హారతి ఇవ్వాలి... చింబలి లోని దీపం కొండెక్కాక అది కూడా ప్రసాదంగా తినవచ్చు... ఆ రోజు ఒక్కపూట అల్పాహారం తీసుకుని సాయంత్రం 6.గ దాటాక శివాలయంలో దీపారాధన చేసి చంద్రుడికి నమస్కరించు కుని రాత్రికి బోజనం చేయాలి.. (ఇది కూతురు కాపురం కోసం అని సంకల్పం చెప్పుకుని తల్లి కూడా చేయవచ్చు...) 3.. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు లేక వారి పేరుతో ఎవరైనా చేయవచ్చు... మట్టితో శివలింగం అది పుట్ట మన్ను అయితే చాలా విశేషం లేదా శుభ్రంగా ఉన్న మట్టితో స్వయంగా శివలింగాన్ని చేసి ఒక ఆసనం ఏర్పాటు చేసి వైద్యనాద్ స్త్రోత్రం తో 11 సార్లు విభూదితో అర్చన చేయాలి, మ్రుతున్జయ మంత్రం (త్రయంబకం) 108 సార్లు చదవాలి, కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టాలి... పూజ తర్వాత ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్లకు పోయావచ్చు.... 4. అప్పులు ఎక్కువ గా ఉంది వడ్డీ లు కట్టుకుంటూ ఎంత కి అప్పులు తీరని వాళ్ళు, ఉద్యోగం లేని వారు, ఉద్యోగం ఉన్న తగిన జీతం రాని వాళ్ళు, వ్యాపారంలో లాభాలు లేని వారు...ఇలాగే మట్టితో శివలింగాన్ని చేసుకుని బాగా అలంకరించి.. చలిబిండి నైవేద్యం పెట్టి 16 సార్లు దారిద్ర్య దహన స్త్రోత్రం పారాయనఁ చేస్తూ శివుడికి బియ్యం పిండి తో అర్చన చేయాలి... ఆ రోజు శివాలయంలో దీపారాధన ప్రదోష కాలంలో పెట్టి ప్రదోష అష్టకమ్(సత్యం బ్రవీమి) ఒకసారి చదువుకోండి... శివదర్శనం చేసుకోండి... 5. విహహం ఆలస్యం, జాతక దోషం, బుద్ధి మాంద్యం ఉన్నవాళ్లు.. బియ్యం పిండిలో గంధం కలిపి శివలింగం చేసుకుని...విభూదితో.. శివ పంచాక్షరీ స్త్రోత్రం 11 సార్లు అర్చన చేసి, పానకమ్, కొబ్బరికాయ, సుండలు నైవేద్యం పెట్టి పూజ అయ్యాక ఆ ప్రసాదం కొద్దిగా తిని పంచి పెట్టాలి. సంకల్పం లో వివాహం మంచి సంబంధం కుదరాలి అని చెప్పుకోవాలి... ఆ శివలింగాన్ని నీటిలో కలిపి తులసి మొక్కకు కానీ రావి చెట్టుకు కానీ పోయాలి... 6. కుజదోషం తో ఇబ్బందులు పడుతున్న వారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాద లేని వారు ఆ రోజు సుబ్రమణ్య స్వామి కి బెల్లం నువ్వులు కలిపిన చింబిలి నివేదన చేసి అష్టోత్రం తో పూజ చేసి ఏకభుక్తం చేయాలి ఒక్కపూట బోజనమ్ చేసి సాయంత్రం శివాలయంలో దీపం పెట్టాలి... 7. జేష్ఠ నక్షత్రం వారు ఐదు వేపచెట్లకు నీరు పోయాలి... 8. దూరంగా ఉన్న పిల్లలు అంటే హాస్టల్ లో విదేశాల్లో ఉన్నవారి కోసం వారి కుటుంబ సభ్యులు ఈ సోమవారం అమావాస్య రోజు శివాలయంలో అబీషేకం చేయించు కోవడం మంచి, వారే కాదు శివనుగ్రహం కోసం ఎవరు అబీషేకం చేయించు కున్నా చేసినా మంచిది.. 9. ఇంక చివరిగా మన శివ భక్తుల కోసం ఈ సోమవారం పౌర్ణమి రోజున బిల్వదలాలతో అర్చన చేసిన , అభేషేకం, శివ నామ స్మరణం మరింతగా శివాను గ్రహము కలిగిస్తుంది.. (ఇవన్నీ పెద్దగా సమయము ఖర్చు లేకుండా దైవానుగ్రహం పొందే మార్గాలు.. మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి ఏ ఒక్కరికి ఉపయోగ పడినా ఆ పుణ్యం మీకే) రాత్రి పౌర్ణమి ఘడియలు మాత్రం రేపు అనగా ఆదివారం ఉన్నది సొమవారం పగటి సమయంలోనే పౌర్ణమి కలదు. గమనించ ప్రార్దన...

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
Gayatri Jun 15, 2019

*మనోబలం* మనిషి మనుగడకు, విజయసాధనకు శారీరకబలం అవసరమే కాని అంతకంటే ముఖ్యంగా కావాల్సింది- మనోబలం. మనోబలం వల్లే మనిషి తాను కోరుకున్న లక్ష్యాలను చేరుకోగలడు. మానసిక బలహీనుడు ఏ పనీ ఆరంభించడు. ఆరంభించినా అందులో మనసు లగ్నం చేయలేడు. మనసే అన్నింటికన్నా బలీయమైంది. మనోబలం నిండుగా ఉన్నవాడే అసలైన బలవంతుడు. స్థిరచిత్తం కలిగిన బలవంతుడు ఎలాంటి కార్యాన్నయినా సాధించగలడని భాస్కర శతక కారుడు చెబుతాడు. మన పురాణ గాథలు గమనిస్తే మనోబలంతో మహాకార్యాలు సాధించిన మహనీయులెందరో కనిపిస్తారు. వారు ఈ నేల తల్లిని పునీతం చేసి లోక కల్యాణం కోసం పాటుపడ్డారు. సగరులను తరింపజేయడానికి గంగను దివి నుంచి భువికి తీసుకు వచ్చిన భగీరథుడి మనోబలం సామాన్యమైనది కాదు. అతడు తన పూర్వీకులు సాధించలేని కార్యాన్ని పట్టుదలతో పూర్తి చేసి శాశ్వత కీర్తి పొందాడు. జాంబవంతుడి ప్రేరణతో సీతాన్వేషణకు పూనుకొన్న హనుమంతుడు మనోబలంతోనే శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించాడు. సీత జాడ తెలుసుకుని రామ కార్యాన్ని పూర్తి చేశాడు. భక్తికి, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. గురువు ద్వారా శిక్షణ పొందలేకపోయినా నిరాశ చెందక మొక్కవోని సాధనతో ఏకలవ్యుడు గొప్ప విలుకాడు కాగలిగాడు. మనోబలం మనిషికి సంకల్పాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తిని విజయతీరం వైపు నడిపించి ఆశయసిద్ధికి తోడ్పడుతుంది. మనిషిని మనీషిగా మారుస్తుంది. మనోబలం కలవారు మౌన గంభీరులై ఉంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నులై ఉంటారు. మనోబలం ఉన్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. విత్తనం నాటాలంటే ముందు నేలను బాగా పదును చేయాలి. నీరు అందించాలి. మేలిమి విత్తనాలు నాటాలి. మొలకెత్తాక ఎరువులు వేయాలి. మొక్క ఎదిగేవరకు కాపాడాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది కదా. ఒక్కొక్కప్పుడు మనిషి తొలి ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందకూడదు. లక్ష్యసాధనలో ఎన్నో రకాల పరీక్షలు ఎదురవుతాయి. వాటిని తట్టుకోవాలి. అడ్డంకులను అధిగమించాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుని శ్రద్ధ, అవగాహనతో ముందుకుసాగాలి. అప్పుడే అతడు విజేత కాగలుగుతాడు. విశ్వవ్యాప్తమైన ఆకాశాన్ని చూసి భయపడి చిన్న పిచ్చుక ఎగరడం మానదు. మనోబలంతో, తనకున్న చిన్న రెక్కలతోనే ముందుకు సాగుతుంది. అలాగే అనంత సాగరాన్ని చూసి చేపపిల్ల భయపడదు. చిన్న మొప్పలతోనే ఈదడం ప్రారంభిస్తుంది. మనిషి కూడా మంచి ఆలోచనతో, పట్టుదలతో లక్ష్యసాధనకు కృషి చేయాలి. దారి పొడుగునా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి. పరుగుపందెంలో కిందపడినవాడు బాధపడుతూ ఉంటే అక్కడే చతికిలపడతాడు. మనోబలంతో లేచి శక్తి కూడదీసుకుని విజృంభిస్తే చివరికి అతడు అందరికంటే ముందుగా నిర్దేశిత లక్ష్యం చేరుకుంటాడు. మనిషి తాను బలహీనుడిని అని ఎప్పుడూ అనుకోకూడదు. తోడ్పాటు కోసం ఎదురుచూడక ప్రయత్నశీలుడై లక్ష్యసాధనకు కృషిచేయాలి. ఎన్నో బాలారిష్టాల్ని అధిగమించి ఎదిగిన వృక్షం తన నీడను తాను వాడుకోదు. తన ఫలాలు తాను భుజించదు. ఓ వృక్షంలా, ఓ నదిలా మనిషి కూడా మనోబలంతో ముందుకుసాగి విశ్వ శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఎందరో శాస్త్రవేత్తలు, నాయకులు శారీరక వైకల్యాలను అధిగమించి మనోబలంతో మానవాళికి సేవచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మనిషీ సేవాతత్పరతతో ముందుకు సాగి శాశ్వత కీర్తిని పొందాలి!

+11 प्रतिक्रिया 1 कॉमेंट्स • 11 शेयर
Gayatri Jun 14, 2019

నామనసిధ్ధాంతి: *మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. *6. తీర్థ మంత్రం* జ. అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం . *7. స్నానము ఎలా చేయ వలెను?* జ. నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను. చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను. స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును. సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను. *8. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?* జ. గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది. *9. పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?* జ. తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు. *10. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?* జ. సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల. రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది. ( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు ) *11. హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?* జ. కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం. *12. ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?* జ. మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. *13. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?* జ. పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.*అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృ ద్ధి కోసం సృష్టించినవి*. జాతికి జన్మస్థానాలు అని* తెలియచెప్పింది*. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది. *14. మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?* జ. *వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం.* బధ్రినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది.

+14 प्रतिक्रिया 2 कॉमेंट्स • 16 शेयर
Gayatri Jun 14, 2019

⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛                                          🛑హనుమ భోజన కధ🛑 సీతా సాధ్వికి హనుమ మీద అమిత పుత్ర వాత్సల్యం ఉంది. తనను మళ్ళీ శ్రీరాముని సన్నిధికి చేర్చినది మారుతియే ననే నమ్మకం ఆమెది . ఆ సంజీవ రాయుడే లేకపోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదనుకొనేది. ఇప్పుడు ఆమె అయోధ్యా నగరానికి మహా రాణి. పుత్ర వాత్సల్యంతో అతన్ని విందుకు ఆహ్వానించ దలచి శ్రీ రామునికి తెలిపింది. దానికి రాముడు  ”సీతా ! ఆంజనేయునికి తృప్తిగా భోజనం పెట్టగలవా? అతడు రుద్రుడు. బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో ” అని ముందే హెచ్చరించాడు. జానకీదేవి హనుమను మహావీరునిగా, అధ్యాత్మ చింతనా పరునిగా భావించింది కాని, రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మరిచిపోయింది. ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది. నోరూరించే పిండి వంటలు తయారు చేసింది. హనుమను ఆహ్వానించింది. అతడు సమయానికి వచ్చాడు, విస్తరి ముందు హాయిగా కూర్చున్నాడు. అన్ని పదార్ధాలను సీతాదేవియే వడ్డించింది. వడ్డించినవి , వడ్డించినట్లు తినేస్తున్నాడు మారుతి. ఒకే పదార్ధాన్ని అనేక సారులు అడిగి వడ్డింప జేసుకొని లాగించేస్తున్నాడు. వండిన వన్నీ ”స్వాహా” చేసేశాడు. దిక్కు తోచలేదు సీతమ్మకు. తృప్తిగా తినకుండా హనుమ విస్తరి   ముందు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించలేదు. అప్పుడు ఆమెకు, తన భర్త, హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మనస్సులో శ్రీ రాముని ధ్యానించి, నమస్కరించింది. హనుమ వెనుక నుంచొని, శివ పంచాక్షరి, ”ఓం నమశ్శివాయ" ను జపిస్తూ, శివున్ని కాసేపు ధ్యానించింది. మహా రుద్రావతారుడైన శివాత్మజుడైన హనుమ, తన రుద్రారూపాన్ని సీతామాతకు చూపించి కడుపు నిండిన వాడిలాగా జుర్రున త్రేపుతూ, విస్తరి ముందు నుంచి లేచాడు. ఆంజనేయుని శివావతారాన్ని అప్పుడామె దర్శించి, ఆనందించింది. అప్పటి దాకా హనుమపై ఉన్న సాధారణ దృష్టి మారిపోయి, విశేష గౌరవ దృష్టితో చూడటం మొదలు పెట్టింది.     *అవిసె చెట్టు ప్రసాదం* సీతారాములు శత కంథ రాక్షస సంహారం చేసి,అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశీ పర్వదినం. ఏకాదశీ వ్రతాన్ని, శ్రద్ధతో నిర్వహించి, మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు. ద్వాదశి ఘడియలు దాటి పోకుండా, విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి. రాముని సోదరులు, అనేక మంది రాజులు , విభీషణుడు మున్నగువారు, సుగ్రీవాదులు అందరు, ఉచిత స్థానాల్లో భోజనాలకు కూర్చున్నారు. అందరికి బంగారు ఆకులలో, వడ్డన జరిగింది. భోజనం తినటానికి ముందు, అందరు పరిశేచనం (నీటిని విస్తరి చుట్టూ మంత్ర పూతంగా తిప్పటం ) చేస్తున్నారు. అప్పుడు హనుమ ఒక్క ఉదుటున, శ్రీరాముని సమీపించి నమస్కరించి, ”రాజారామా ! భక్త పరాదీనా !ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది. ఆలించు. మొదటగా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా, మీ ప్రసాదంగా భుజించటానికి అనుజ్ఞనివ్వండి .”అని ప్రార్ధించాడు. ఇందులో ఏదో అంతరార్ధం ఉండి ఉంటుందని, లేకపోతే, ఇలాంటి కోరిక కోరడని, గ్రహించాడు రాముడు. "సరే అలానే కానిద్దాం ” అన్నాడు. రామాదులు, మహర్షులు తృప్తిగా భోజనం చేశారు. హనుమ, శ్రీరాముని బంగారు విస్తరిలో తినగా మిగిలిన పదార్ధాలతో ఒక ముద్దను ఒక గిన్నెలో ఉంచుకొని , దాన్ని దగ్గరలో ఉన్న ఒక అవిసెచెట్టు దగ్గరకు చేరి, కింద ఉంచాడు. అవిసె పూలను కోసి, ఒక చోట చేర్చాడు. హనుమ ఏoచేస్తాడో చూడటానికి, రామునితో సహా, అందరు కుతూహల పడుతున్నారు. అప్పుడు మారుతి, సుగ్రీవాది వానర వీరులందరినీ తన దగ్గరకు రమ్మని, ఆహ్వానించాడు. వారంతా, బిలబిలలాడుతూ చేరుకొన్నారు. శ్రీ రాముని ప్రసాదం అని చెప్పి, ఆ గిన్నే లోని దానిని, ఒక ముద్దగా చేసి, దానితో పాటు, అవిసె పువ్వును, ఒక్కక్క వానరుని చేతిలో ఉంచాడు. దానిని ”రామార్పణం ”అని అనుకొంటూ, కళ్ళకు అద్దుకొని ప్రసాదంగా భుజించమని కోరాడు . అందరు హనుమ చెప్పినట్లే చేశారు .అందరు తిన్న తరువాత, మారుతి, తాను కూడా దాన్ని అవిసె పువ్వుతో సహా, ప్రసాదంగా కళ్ళకు అద్దుకొని తిన్నాడు. ఇంత మంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే,ఆ కాసిని అవిసె పూలే, అవ్యయంగా సరిపోయాయి . అప్పుడు శ్రీ రాముడు హనుమ చెంతకు చేరి ” వాయునందనా! ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల, ద్వాదశి పారాయణ సమగ్రంగా , సంతృప్తిగా, సంపూర్ణం అయింది . ద్వాదశి వ్రతానికి గొప్ప సార్ధకత లభించింది. కనుక ఇప్పటి నుoడి, ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిధులలో, ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను , కాయలను; పత్రాలను, భోజన పదార్ధాలుగా ఉపయోగించిన వారికి, సకల సుఖ శాంతులు లభిస్తాయి. వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు" అని వరం ఇచ్చాడు.అప్పటి నుండి అవిసె చెట్టు, విష్ణు ప్రీతీ కరమైనదిగా భావిస్తున్నారు. దాని ఆకులు; కాయలు; పూలను; భక్తీతో ద్వాదశి నాడు భుజిస్తారు. అవిసెకు ”అగస్త్య"  అనే పేరు ఉంది. ఆకాశంలో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు; అవిసె బాగా పూస్తుంది. అవిసెను ”అగిసే” అనీ కొన్ని చోట్ల పిలుస్తారు. అవిసె చెట్టు మహాత్మ్యాన్ని, అందరికి తెలియ జేసిన ఘనత, హనుమంతునిదే. ⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Gayatri Jun 14, 2019

నేను గాయత్రి జపించవచ్చా? ఒకనాడు ఒక రైతు భక్తుడు మహాస్వామిని, "నేను గాయత్రీ మంత్రం జపించవచ్చా?" అని అడిగాడు. ఈ ప్రశ్న ఎంతటివారినైనా ధర్మసంకటంలో పడేస్తుంది. జపించవచ్చు అన్నా జపించకూడదు అన్నా చర్చనీయాంశం అవుతుంది. శ్రీమఠం యొక్క ప్రధాన కార్తవ్యం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ దాన్ని కాపాడటం. ఈ భరత భూమి వేల సంవత్సరములుగా ఎన్నిటినో చూసింది. ఈ దేశ ప్రజలు తమ సనాతన ధర్మం యొక్క ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే, దురాక్రమణలను అణచివేతలను ఎదుర్కొన్నారు. ఈదురుగాలులకి వొంగిన పైరు గాలి ఉధృతి ఆగిపోగానే లేచి నిలబడినట్టు, మాహావృక్షం వంటి ఈ వేదభూమి కూడా ఎన్నో దాడులను తట్టుకుని అలాగే నిలబడింది. కాని శ్రీమఠం ఎన్ని మార్పులకు సమన్వయం చూపగలదు? అందులో శ్రీమఠం యొక్క వాటా ఎంత? ఇవాల్టి ఆలోచన రేపటికి పాతది అయిపోతుంది. ఆ మరుసటి రోజుకి ఉనికినే కోల్పోతుంది. ఒక డ్యాం కూలిపొయినప్పుడు వచ్చే వరదని ఎవరూ నివారించలేకపొయినా, ఏదో ఒక రోజున వరద తగ్గిన తరువాత, ఆ ప్రవాహాన్ని ఒక నదిగా మార్చాలి కదా. పరమాచార్య స్వామివారు ఏమి చెప్తారో ఎవరికి తెలియలేదు. కాని స్వామివారు ఏ క్లిష్ట సమస్యకైనా వారిదైన విశిష్ట శైలిలో పరిష్కారం చూపించగలరు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భక్తునితో, "నీకెంత మంది పిల్లలు?" అని అడిగారు. అతను "మీ ఆశీర్వాదం వల్ల ముగ్గురు ఆడపిల్లల్లు పుట్టారు. మొదటి అమ్మయికి 5 యేళ్ళు. రెండో అమ్మాయికి 3 యేళ్ళు. అఖరి దానికి 6 నెలలు" అని చెప్పాడు. స్వామి ఇలా చెప్పారు, "ఒకర్ని గాయత్రి అని, రెండో అమ్మాయిని సంధ్య అని, మూడో అమ్మాయికి సావిత్రి అని పేర్లు పెట్టి పిలువు. బేబి, లిల్లీ, బిల్లీ ఇలాంటి పేర్లతో పిలవద్దు. ఇలా నువ్వు రోజూ గాయత్రి, సంధ్య, సావిత్రి అని పిలుస్తూ ఉంటే నీకు గాయత్రి మంత్ర జప పుణ్య ఫలం దక్కుతుంది". ఆ భక్తుని మొహం ఆనందంతో వెల్లివిరిసింది. సాంప్రదాయానికి వ్యతిరేకమైన పనిని చేబూనిన సమయంలో పరమాచార్య స్వామివారు అతనికి విషయ అవగాహన కలిగించి ఒక స్పష్టమైన సమాధానాన్ని అందించారు. మహాస్వామి వారి నుంచి ప్రసాదం తీసుకుని నిండైన ఆశీస్సులతో సంతోషంగా తన స్వస్థానానికి వెళ్ళాడు ఆ భక్తుడు. [వర్ణ వ్యవస్థలో ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చెయ్యవలసిన అవసరం లేదు. ఉదాయాన్నే తూర్పువైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేస్తారు. అనుకూలం ఉన్నవారు భవిష్యోత్తర పురాణంలోని బ్రహ్మప్రోక్త సూర్య స్తుతిని చదువుకోవాలి] అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 🙏🙏🙏🙏 KanchiParamacharyaVaibhavam

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Gayatri Jun 12, 2019

*'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి?* దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది.... పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు. ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే *'మకరతోరణం'* అని పేరు వచ్చింది.

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर