శంకర

అరుణాచలం: శివుడూ చదువుకున్నాడు! ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు. కై లాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. 'చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.🙏 తలకెక్కితే తిప్పలే! ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది. యా జ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.🙏 దేవతలే దిగిరారా! ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జా బాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.🙏 ప్రలోభాలకు లొంగకుండా... తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తం డ్రి వాజశ్రవుడు కోపంతో 'నిన్ను యముడికి దానం చేస్తా'నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.🙏 హనుమ కథ వినుమా! చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. త ల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా ని రుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

శివునికి తల్లి అయిన భక్తురాలి గాధ పార్వతీపరమేశ్వరులు ఈ జగత్తుకి ఆదిదంపతులని భక్తుల నమ్మకం. ఆ ఆదిదంపతులని నిరంతరం తలచుకుని, నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవ లేదు. అలాంటి ప్రతి భక్తునిదీ ఓ దివ్య గాథే! తమిళనాట 6-8 శతాబ్దాల మధ్య నివసించిన శివభక్తులలో కొందరిని నయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది. 63 మందిగా ఉన్న ఈ నయనార్లలో ఒకరైన `కరైక్కాల్‌ అమ్మయార్‌` అనే భక్తురాలి కథే ఇది… కరైక్కాల్‌ అమ్మయార్‌ చిన్నపాటి పేరు పునీతవతి. పేరుకి తగినట్లుగా ఆమె శివభక్తితో పునీతురాలిగా ఉండేది. వారి కుటుంబం తమిళనాట ఉన్న కరైక్కాల్‌ అనే పట్నంలో నివసించేవారు(ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది). పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడంటే మహా ప్రీతి. నిరంతరం శివనామస్మరణ చేయడమే కాకుండా, ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది పునీతవతి. యుక్తవయసు రాగానే పునీతవతిని పరమదత్తన్‌ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. పరమదత్తన్‌ అందంలోనే కాదు… సంపదలోనూ, వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే. ఒకపక్క భార్యగా పరమదత్తన్‌ బాగోగులను చూసుకుంటూనే, ఎప్పటిలా శివభక్తుల సేవను కూడా కొనసాగించింది పునీతవతి. మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే… పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది. ఒకనాడు పరమదత్తన్‌ ఎవరో రెండు మామిడి పంఢ్లను ఇస్తే, వాటిని ఇంటికి పంపాడు. అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీవతి గుమ్మం దగ్గరకి వచ్చి నిల్చొన్నాడు. ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తికాలేదు. భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ, ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కానీ పునీతవతికి మనసు ఒప్పలేదు. దాంతో తన చేతిలో ఉన్న రెండు మామిడిపండ్లలో ఒకదానిని అతనికి అందించింది. మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది. ఆ రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్‌ ఆ మామిడిపండును ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ రుచి అతనికి నచ్చడంతో రెండో మామిడిపండుని కూడా ఇవ్వమని అడిగాడు. ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి. వంటింట్లోకి వెళ్లి బిక్కమొగం వేసుకుని నిల్చొంది. `పరమేశ్వరా ఇప్పుడేం చేసేది!` అని మనసులో అనుకుందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడిపండు ప్రత్యక్షమైంది. తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడిపండుని సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి. అయితే దాన్ని రుచి చూసిన పరమదత్తన్‌ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తన జీవితంలో అంత మధురమైన మామిడిపండుని తిననేలేదు. ఇందాక తిన్న మామిడిపండు ఇలాంటిది కానేకాదు. `ఇది నేను పంపిన మామిడిపండులా లేదే! ఇదెక్కడిది?` అని భార్యని అడిగాడు పరమదత్తన్‌. అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగింది చెప్పేసింది. పరమదత్తన్‌కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కానీ, ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు. అందుకని ఆమెను పరీక్షించేందుకు `నువ్వు చెప్పిందే నిజమే అయితే మరో పండుని నాకోసం తెప్పించు చూద్దాం!` అంటూ సవాలు విసిరాడు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవతికి. శివుని తల్చుకుని చేయిని చాచగానే మరో మామిడిపండు ప్రత్యక్షం అయ్యింది. అయితే దానిని పరమదత్తన్‌ ముట్టుకోగానే అదృశ్యం అయిపోయింది. జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్‌. అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదనుకున్నాడు. అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదనుకున్నాడు. అందుకని తానే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మరో పట్నానికి వెళ్లిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు. మరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలతో కాలం గడపసాగాడు. కొన్నాళ్లు నిరీక్షించిన తరువాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు. తన భర్త గురించి తెలిసిన వెంటనే అతన ఇంటికి చేరుకుంది పునీతవతి. పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్‌. తాను చాలా సామాన్యుడిననీ, పరమభక్తురాలైన ఆమెను తగనని చెప్పి మోకరిల్లాడు. దాంతో `ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి, ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పస్తాను. పరమశ్వరా! సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు. నాలోని అందాన్ని తొలగించు` అని శివుని ప్రార్థించింది పునీతవతి. దాంతో ఆమెలోని ముగ్థత అంతా తొలగిపోయి, అతి సామాన్య రూపంలోకి మారిపోయింది. ఆనాటి నుంచీ పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది. పంచాక్షరిని జపిస్తూ, పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాలలోని కైలాసగిరిని చేరుకుంది. శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన కాళ్లతో తొక్కడం ఇష్టం లేకపోయింది పునీతవతికి. అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కసాగిందట. ఆ వింత దృశ్యాన్ని చూసిన పార్వతిదేవి `ఆమె ఎవర`ని అడగడంతో `నా భక్తులను కన్నతల్లిలా కాచుకున్న పునీతురాలు` అన్నాడట శివుడు. చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి `బాగున్నావామ్మా` అంటూ క్షేమసమాచారాలను అడిగాడట. అప్పటి నుంచి ఆమెకు `అమ్మయార్‌` అన్న పేరు స్థిరపడిపోయింది. శివుని అభీష్టం మేరకు అమ్మయార్‌ తన జీవితం చివరి వరకూ చెన్నైకి పశ్చిమాన ఉన్న `తిరువలంగడు` అనే ఊరిలోని శివాలయంలో నివసించారు. అమ్మయార్‌ శివుని మీద కొన్ని కీర్తనలని కూడా స్వరపరిచారు. ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త `కరైక్కాల్‌ అమ్మయార్‌` అంటారు కొందరు. కరైక్కాల్‌ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది. ఇక శివభక్తులను తల్చుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ ఉంటుంది ఓం నమః శివాయ

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
avl Jun 19, 2019

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
Sarma Sarma Jun 19, 2019

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर